sperm DNA damage: పొగ తాగడం పుట్టబోయే పిల్లలకూ హానికరమే!: ఢిల్లీ ఎయిమ్స్ నిపుణుల హెచ్చరిక

  • పొగ తాగడం వల్ల శుక్ర కణాల డీఎన్ఏ దెబ్బతింటుందని వెల్లడి
  • ఫలితంగా పిల్లలు పుట్టకపోవడం, పుట్టే పిల్లల్లో లోపాలు
  • మద్యపానం, మితిమీరిన సెల్ ఫోన్ వాడకం, ప్రాసెస్డ్ ఫుడ్ తో చేటు
Smoking and alcohol linked to sperm DNA damage Experts

పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం.. ఎంతగా అంటే మీ ఆరోగ్యమే కాదు మీకు పుట్టబోయే పిల్లల ఆరోగ్యానికి కూడా చేటు తెచ్చేంతగా అని ఢిల్లీ ఎయిమ్స్ వైద్య నిపుణులు హెచ్చరించారు. పొగతాగే అలవాటు వల్ల పురుషులలో శుక్ర కణాల డీఎన్ఏ దెబ్బతినడమే దీనికి కారణమని అంటున్నారు. వీర్య నాణ్యతపై ప్రభావం పడడం వల్ల పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతుందని తెలిపారు. గర్భం నిలవక పోవడం, పదే పదే అబార్షన్ జరగడంతో పాటు పిల్లల్లో పుట్టుకతో లోపాలు సంభవించే అవకాశం ఉందని వివరించారు. పొగతాగే అలవాటుతో పాటు మద్యపానం, మితిమీరిన సెల్ ఫోన్ వాడకం, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం ఈ ప్రమాదాన్ని మరింత పెంచుతున్నాయని చెప్పారు.

వీర్యంలో తక్కువస్థాయి యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉంటాయని, డీఎన్‌ఏను చక్కబెట్టే వ్యవస్థ నిష్క్రియగా ఉంటుందని ఎయిమ్స్‌లోని అనాటమీ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్ రీమా దాదా పేర్కొన్నారు. స్పెర్మ్ డీఎన్ఏను అనారోగ్యకర జీవనశైలి, మద్యపానం, ప్రాసెస్డ్ ఫుడ్, కాలుష్యం మరింత దెబ్బతీస్తున్నాయని వివరించారు. వీటికి తోడు ఆలస్యంగా వివాహం చేసుకోవడం, పిల్లలు కనడానికి ఆలస్యం చేయడం కూడా వీర్యం నాణ్యత మరింత క్షీణించడానికి కారణమవుతున్నాయని ప్రొఫెసర్ రీమా చెప్పారు. వయసు పెరుగుతున్నకొద్దీ డీఎన్ఏ నాణ్యత తగ్గుతుందన్నారు. దెబ్బతిన్న వీర్యం కారణంగా పుట్టే పిల్లల్లో జన్యు లోపాలతో పాటు అంగవైకల్యం తదితర సమస్యలు ఏర్పడే ముప్పు ఉందని ప్రొఫెసర్ చెప్పారు. సంతానలేమి, పదే పదే అబార్షన్ జరగడానికి స్పెర్మ్ డీఎన్ఏ దెబ్బతినడానికి సంబంధం ఉన్నట్లు పలు అధ్యయనాల్లో తేలిందని ప్రొఫెసర్ డాక్టర్ రీమా పేర్కొన్నారు.

More Telugu News